పూరీ గారు కులం చూడకుండా నాకలం దమ్ము చూసి నాకో అవకాశం ఇవ్వండి.

 తెలుగు సినిమా దర్శకులు పూరీ జగన్నాథ్ గారికి,


ఓ దళిత యువకుడు రాసుకొను విన్నపము.


సర్, నేను అంటరాని కులంలోను పేదరికంలోను జన్మించిన వాడిని.


మేము ప్రభుత్వం నెల నెలా అందించే రేషన్ తీసుకుని బ్రతికే బడుగు బలహీన వర్గాల వారిమి.


అలాగే ప్రభుత్వం ఉచితంగా అందించే తెలుగు మీడియం విద్యను అభ్యసించిన వాడిని.


అంతేకాక ప్రభుత్వం ఉచితంగా అందించే వైద్య సదుపాయాలు సైతం పొందే పేదలం.


సర్ మాకూ మగ్గిపోయిన పురుగులు పట్టిన కంపు కొట్టే రేషన్ బియ్యం తినాలని వుండదు కాని 365 రోజులూ కూలి కెళ్ళినా మంచి బియ్యం కొనడానికి డబ్బులు చాలవు. 

ఎందుకంటే అందరి జీతాలు పెరుగుతాయి, నిత్యవసరాల ధరలూ పెరుగుతాయి కాని మా కూలి రేట్లు మాత్రం పెరగవుగా.


సర్ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకునే చదివాను కాబట్టే ఫెయిల్ అవ్వాల్సిన వాడిని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా.

నన్నెవరూ ప్రోత్సహించలేదు , వెన్ను తట్టి ముందుకు నడిపించలేదు నాకు నేనే సర్ధి చెప్పుకుంటూ నన్ను నేనే ప్రోత్సహించుకుంటూ చదివా. ఇంకెవరైనా ప్రోత్సహించి ఉండి యుండుంటే ఇంకా బాగా చదివే వాడినేమో.

మేము పేదలం కదా తెలుగు మీడియమే మాకు ఎక్కువ సర్ అందుకే ఏ అవకాశాలు లేని తెలుగు మీడియంలో చదివా.

నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో చదువుతుండగా ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నిమ్మకూరులో జరపడానికి మీరు గుడివాడ బస్టాండ్ మీదుగా జన సందోహంతో వెళ్తుండగా సరిగ్గా బస్టాండ్ దగ్గర నా చెప్పు ఒకటి మిస్సైపోయింది అది తెల్లారి కోతి బొమ్మ సెంటర్ దగ్గర బస్సులో కాలేజ్ కి వెళ్తుండగా తెగిపోయి కనబడింది. 

ఐతే మళ్ళీ చెప్పులు కొనుక్కోవడానికి నాకు చాలా కాలం పట్టింది.

ఒకసారి ఊహించుకోండి కాలేజ్ లో అందరూ షూ లతో రక రకాల చెప్పులతో , డ్రస్సులతో బైక్ పై వచ్చే కుర్రకారు మధ్య కనీసం చెప్పులు కూడా లేకుండా కాలేజ్ కి వెళ్ళడం ఎంత అవమానకరమో.

నా పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ముందుంటే అందరికీ కనిపిస్తానని వెనుక బెంచ్ లోనే కూర్చునే వాడిని.

వెనుక బెంచ్ లో వుండటం వల్ల వాళ్ళందరి లోపాలు నాకు తెలిసాయి. పేదరికమనే లోపం అది నా లోపం కాదని నాకర్థమైంది.


సర్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకునే రేట్లు వినే గుండె ఆగి చస్తాం నిజం.


నాకిచ్చే రేషన్ ఇక నాకొద్దు నాబదులు మరో పేద వాడికివ్వండి అని చెప్పాలని నాకూ ఉంది సర్ కాని ముందు అసలు నా కాళ్ళపై నేను నిలబడదామంటే ఆర్ధికంగా నాకాళ్ళు నరికేస్తే నా కాళ్ళ పై నేను నిలబడాలనుకుంటే ఎలా నిలబడగలను సర్.

కనీసం బ్యాంకులు సైతం మాకు ఆర్ధిక చేయూత నివ్వాలంటే షూరిటీ అడుగుతుంది. అసలు ఆ షూరిటీ కుడా లేదనే కదా షూరిటీ ఐనా కల్పించుకుందామని లోన్ కి అప్లై చేస్తే వాళ్ళు షూరిటీ లేనిదే ససేమీరా అంటున్నారు.


ఐనా పర్లేదు నామీద నాకు నమ్మకం ఉంది. 

నేనూ విజయం సాధిస్తానని.


తెలుగు మీడియంలో ఉపాధ్యాయ విద్యనభ్యసించాను. నావిద్య నాకు ఉపాధినివ్వలేనిదిగా వుంది. ఐనా పర్లేదు అదే తెలుగుతో సినిమాలలోకి కథా రచయితగా వస్తా కనువిప్పు కలిగించే కథలెన్నో రాసి కాస్తంత ఉపాధి పొందుతా.


నాపై నాకు నమ్మకముంది 

నా కథలలో దమ్ముంది 

విని నాకు పారితోషకం ఇచ్చి

కథ కొనుక్కునే దమ్ము మీకుందా!


లేక కథ వినేసి ముందు ఇదేం కథని మార్పులు చేర్పులు చేసుకుని సినిమా తీసేసుకుని పేరు ప్రఖ్యాతలు, పైసలు సంపాదించేసుకుంటారా!


ఓటు హక్కు సంపాదించేంత చదువే కాదు రాజకీయాలలో నిలబడేంత చదువు నాకుంది. 

పనికి మాలిన వెధవ నాయకులందరిని తిరస్కరించే నోటా ఓటు వేయగలను

రాజకీయాలలో సమూల మార్పులను తేగల నాయకునిగాను నిలబడగలను.


అవును పేదలు నాఅంటరాని కులంలోనే కాదు అన్ని కులాలలోనూ వున్నారు

వారందరికీ నేను న్యాయం చేయగలను.


నేను ఇండివిడ్యువల్ గా చాలా స్ట్రాంగ్.

నాదేశమంటే నాకెంతో ఇష్టం.

భారతీయుడిగా జన్మించినందుకు నేనెంతో గర్వపడతాను.

నాదేశాన్ని ఎంతో ప్రేమించే నేను నాప్రజలను కూడా ప్రేమిస్తాను.


నేటికీ నేను వేళ్ళూనికుపోయిన కులం అనే మహా వృక్షపు వేర్లని మాత్రమే ద్వేషించేది.


నాదేశపు కట్టుబాట్లకు , సంప్రదాయాలకు, సంస్కృతులకు మాత్రం విలువ నిస్తాను.


అలాగే కులాన్ని బట్టి ఉన్న కొన్ని అనాగరిక చర్యలను, మూఢ నమ్మకాలను నేను ఎప్పటికీ అంగీకరించలేను.


మరో ముఖ్య విషయం సర్ సారా తాగి పడిపోయో వాడినీ కానూ వోడ్కా మత్తులో తూలే వాడినీ కానూ

మందు, సిగరెట్, వివిధ మత్తు పదార్ధాలు వేటికీ నేను బానిసను కాను


కాని ఒక్క 'సినిమా' అనే మత్తు కు మాత్రమే బానిసను నేను.

అలాగని నాసి రకం సినిమాలు , విచ్చల విడి శృంగార చర్యలు గల సినిమాలు నాకు నచ్చవు.

విలువలు గల సినిమాలు నాకు ఇష్టం.

కొత్తదనం, సైన్స్ ఫిక్షన్ సినిమాలు మరింత ఇష్టం.


ఇంతకాలం ప్రభుత్వాలు చేసిన అంథత్వ పాలనను ఎండగట్టియుంటే నీ అభిమానిగా సంతోషించేవాడిని

కాని నీజాతిని తిడితే కోపం వస్తుంది కదా అంటూ నువ్వూ నన్నూ గుండెల్లో కులం అనే గునపంతో గుచ్ఛావ్ కదన్నా.


ఏ జాతి అన్నా రేషన్ తిసుకునేది, ప్రభుత్వ బడుల్లో చదివేది, సిగ్గూ శరం లేకుండా తాగిన మైఖంలో పడిపోయేది మేమే కదా!


నువ్వన్న మాటలన్నీ మాబడుగు బలహీన వర్గాల గురించేగా మన దేశంలో సరైన పాలకులు వుండియుంటే నీ వన్న మాటలకు ఈపాటికే మూల్యం చెల్లించ మనేవారు.


నీవు మూల్యం చెల్లించాలనేది నాఉద్దేశం కాదు నేను తల ఎత్తుకు నిలబడతా నేను మనిషిలా పుట్టా మనిషిలా చస్తా 'కులం' అనేది కొందరికి తర తరాలుగా అంటుకున్న జబ్బు అది!

ఆ జబ్బు నాకు లేదులే.


పేదవాడిగా పుట్టాను జీవితం పస్తులతోనూ గడుపుతున్నాను కాని నేను చచ్చే లోపు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి నా చుట్టూ వున్న వారికి కూడా (బ్రతుకు తెరువు) ఉపాధి కల్పిస్తాను.


సర్ ప్రభుత్వాలు వున్నది ఎందుకు మనకు పనులు చేయడానికే గాని వాళ్ళు కోట్లు కూడ గట్టుకోవడానికి కాదు.


ఆనాడు అంబెడ్కర్ గారు కులం అనే ఎడబాటుతో అడుగడుగునా అవమానాలు భరించబట్టే ఆయన అనుభవించిన అవమానం తనలా కులం లోను, ఆర్ధికంగాను వెనుకబడ్డ వర్గాల వారు అవమాన పడకూడదనే రిజర్వేషన్ లు కల్పించారు.

అవి కూడా అందరికీ నేటికీ అందడం లేదన్నది నగ్న సత్యం!


ఏ ఊళ్ళోనైనా నేటికీ ఊరి చివరే కదా సర్ మేము.

హైదరాబాద్ లో కూడా ఇల్లు అద్దెకు అడిగినా కులం అడుగుతారు.

ఏ పనిలో చేరాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా కులం అడుగుతారు

అంతెందుకు సినీ పరిశ్రమంతా కులం అనే వృక్షం మీదేగా వుంది.

పెళ్ళప్పుడు కూడా కులమేగా చూసేది. 

ఒక కులం వాళ్ళు మరో కులం వాళ్ళని చేసుకోవడం ఎంతో నేరం కదా మన సంస్కృతిలో!


ఆయన ప్రపంచ మేథావి కాబట్టే అప్పుడే ఈ అంటరానితనం ఎన్ని యుగాలైనా అలానే వుంటుందనే ముందే వెనుకబడ్డ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించారు.


ఇప్పుడు మీరు ఏమని సవరిస్తారు చట్టాలు, కులం అనే వేర్లు పెకిలించకుండా?!


నాయకుల జీవితాలు తాగుబోతుల చేతుల్లో ఉందా!


అవినీతి పరుల చేతిలో దేశం బంధీగా వుంది నేటికీ.


లేకుంటే పేదరికం పోవడానికి ఎన్ని పంచవర్ష ప్రణాళికలు ప్రకటించి పాలించలేదు 

ఐనా పేదరికం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే వుంది.


కష్టపడతాను నన్ను నేను మార్చుకుని నవ నూతనంగా ఎదిగి నానీడలో కొందరికైనా బ్రతికే అవకాశం కల్పిస్తాను.


జైహింద్.


                               - శీలం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

ఆకాశం నీ హద్దురా...!