జైభీమ్
'జై భీమ్'
జై భీమ్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్.బీ.ఆర్.అంబేడ్కర్ గారే.
అంబేడ్కర్ గారిని మన దేశమే కులం మరక వేసి కూకటి వేళ్ళతో పెకిలించాలనుకున్నా గాని ఆయన రాసిన రాజ్యాంగంను బట్టైనా ఆయనను స్మరించుకోక తప్పదు.
మన తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దినసరి కూలీలంతా ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల వారే కెమెరా ట్రాలీలు మోసే వారి దగ్గర నుండి హీరోల కార్లు నడిపే వరకు అంతా దాదాపు ఎక్కువ శాతం వారే కాని ఏసినిమాలోను వారి కథలు గాని వ్యధలు గాని ఉండవ్.
అంతేకాదు అంబెడ్కర్ అనే మహనీయుని ఫోటో కూడా తగిలించకుండా జాగ్రత్త పడతారు అనేది వాస్తవ సత్యం!
అసలు ఈసినిమాకు అంబేడ్కర్ కు ఏసంబంధం లేదు ఈటైటిల్ ఏమిటని కొందరనుకోవచ్చు కాని ఈసినిమా ఆత్మ అంబేడ్కర్ గారి ఆశయ స్ఫూర్తి.
ఇది ఒక నిజ జీవిత కథ.
తమిళనాడులోని లాయర్ చంద్రు గారి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈకథను తెరకెక్కించారు.
లాయర్ చంద్రూ గారు నిస్వార్ధంగా నిజాయితీగా తన కర్తవ్య బాధ్యతను నెరవేర్చబట్టి అంబేడ్కర్ గారి ఆశయ స్ఫూర్తిని కలిగి ఆయన అమాయక ఖైధీలైన పేదవారి పక్షాన ఆయన నిలబడి న్యాయానికి మూయబడ్డ గంతలు తెరిపించి నిజాలను వెలుగులోకి తేబట్టే నేడీరోజు ఆయన నిజ జీవిత సంఘటనలతో సినిమా తీయడానికి ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలు జ్ఞాన్ వేల్, జ్యోతిక సూర్యలను ముందుగా అభినందించాలి.
సూర్య గతేడాది 'ఆకాశం నీహద్దురా' అంటూ నిజ జీవిత కథతో మన ముందుకు వచ్చి మళ్ళీ సరిగ్గా ఇప్పుడు ఇంకో నిజ జీవిత కథతో మన ముందుకొచ్చాడు.
ఈ రెండు సినిమాలలో ఈ సినిమాలో ఐతే అసలు హీరోయిజం అనేదే లేదు.
పైగా దాదాపు అరగంట కథ తర్వాత గాని సూర్య మనకు తారస పడడు.
లాయర్ లా సూర్య ఒదిగిపోయారు.
వారి సొంత సినిమానే కదాని ఎక్కడా హీరోయిజం చూపించుకోవాలని సమయం సందర్భం లేని అనవసరపు ఒక భారీ ఫైటింగుతో అన్యాయం చేసే పోలీసులను అంతమొందించే కథా నాయకునిలా సూర్య తాపత్రయపడలేదు.
కథ పాత్రకు తగ్గట్టు సూర్య గాని ఇతర పాత్ర ధారులు గాని అందరూ పాత్రలలో ఒదిగిపోయి ప్రేక్షక లోకానికి ఒక మంచి సినిమాను అందించారు.
తెలుగు వారికి ఇటువంటి సంఘటనలు కొత్తేమి కాదు
కాని వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు చూపిన సినిమాలు ఎన్ని?
నిర్మాతలు ఎందరు?
దర్శకులు ఎందరు?
నటులు ఎందరు?
మనకు భారత రాజ్యాంగం ఉన్నది.
మనం ప్రతీ ఒక్కరిమి చట్టాలకు లోబడి జీవించాలి.
చట్టాలను మీరితే శిక్షలున్నాయి
మరి ఆచట్టాలలో వున్న అధికారులే చట్టాలను మీరితే?
వారికి శిక్షలు లేవ్!
మరి సామాన్యుడికి ఏది న్యాయం.
మన దేశ చట్టం అమోఘమైనది
అది సరిగ్గా సక్రమంగా నిర్వర్తించే పాలకులు ఉన్నప్పుడు అది అత్యంత హూందాగా కనబడుతుంది.
అదే దర్శకుడు ఈచిత్రంలో ఒక సన్నివేశంలో వాడుకుని సినిమా స్థాయిని పెంచాడు.
భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికీ ప్రతీ పౌరురాలికి అది ఒక మహోత్తమ గ్రంథం.
దేశంలోని ప్రతీ ఒక్కరూ దానిని మీరకుండా నడుచుకుంటే చాలు మరే మత గ్రంథంతో పనిలేదు మనలో సామరస్యం నింపడానికీ మనలో ఐకమత్యం నింపడానికీ మనలో దేశభక్తి నింపడానికినూ.
అంతేకాదు అధికారంలో వుండి చట్టాన్ని మీరిని వారిని తాట తీసే ఆయుధం కూడా అదే.
నిజం చెప్పాలంటే ఇప్పటికీ పోలీస్ వ్యవస్థపై సమాజంలో గౌరవం లేకపోవుటకు కారణం ఇప్పటికీ ఆ వ్యవస్థలోని ఎక్కువ శాతం మంది చట్టాలలో వుండి చట్టాలను మీరే వారిగా వుండటమే ప్రధాన కారణం.
ఇకపోతే న్యాయస్థానాలు సరేసరి సామాన్య జనాలకు అందనంత ఎత్తులో వుంటాయి.
లాయర్ లకు ఫీజులు ఇచ్చుకునే స్థితి సామాన్య జనానికి లేదు.
చట్టమూ న్యాయస్థానమూ కలసి తమ కర్తవ్యాన్ని తాము నెరవేరిస్థే సామాన్య పౌరుడు సగౌరవంగా బ్రతుకుతాడు.
మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారంతా వెలుగులోకి వస్తారు.
అదే అంబేడ్కర్ ఆశయం చీకటిని చీల్చుకుంటూ వెలుగులోకి రమ్మనే ఆయన పిలుపు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి