అంతానికి ఆరంభం !

 కాలు కదిపితే కరోనా

గడప దాటితే గడగడలాడాల్సొస్తుంది!

గత కొన్నాళ్ళుగా దానితో సహజీవనం చేసి చేసి పాజిటివ్ నుండి నెగిటివ్ లోకి మారే వారి సంఖ్య పెరిగే సరికి గుంపులో గోవిందంలా తిరిగేస్తున్నారంతా కాని చిత్రంగా అది కూడా ఆగుంపులో గోవిందంలా తిరిగే అజాగ్రత్త పరుల పాలిట శాపమై మహమ్మారిలా ముద్దుపెట్టుకుని కౌగలించుకుంటోంది.

జలుబు, జ్వరం వచ్చిందంటే చాలు జనాలు కంగారు పడిపోయి కరోనా వచ్చేసిందనే పరిస్థితీ దాపురించింది!

వాస్తవమేమిటంటే కరోనా నిజంగా వచ్చినవారు కనుమరుగైపోతున్నారు.

కాని కరోనా కరోనా అని కలవరించటం ప్రపంచం మానేసింది.

ఎందుకంటే కరోనా కరీనాలా ఉందిప్పుడు జనాలకి!!

పేరుకే ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి గాని ప్రజలు లాక్డౌన్ పాటిస్తున్నారా ఏంటి!

ముందంటే మౌనం పాటించాం, చప్పట్లు కొట్టాం, దీపాలు వెలిగించాం కాని నేడు!

కాలం(2020) మారినట్లు మనిషి మారిపోతాడు కదా!

ఎందుకంటే మనిషి బ్రతకాలి బ్రతకాలంటే భయపడుతూ కూర్చోలేడు కాలంతో పాటే మనిషి గమనం కూడా ముందుకు సాగాలి.

కరోనా అందరినీ భయపెట్టింది, కొందరిని కనుమరుగు చేసింది, మరికొందరి జీవితంలో మంచి గుణపాఠం నేర్పింది, ఇంకొందరి జీవితాలు అతలాకుతలం చేసేసింది, ఎందరివో బ్రతుకులు చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితులలో పడేసి బ్రతకడానికి  ఏమార్గమూ లేకుండా చేసి వారిని చిదిమేసి చంపేసింది, కేవలం కొందరికి ఒక హాలిడే అకేషన్ లా వారి జీవితాలకి ఒక వర ప్రసాదంలా వచ్చి వరించింది!

దేవుడు అన్యాయం చేసినట్లే కరోనా కూడా దిక్కులేని నిరుపేద జనాలను మరింత దిక్కులేని వారిని చేసింది.

ప్రభుత్వాలు రేషన్ బియ్యమైతే ఇస్తున్నాయి గాని నిత్యవసర వస్తువులు, కూరగాయలు ధరలు సామాన్యులకు శాపంలా మారాయి.

నేటి ఈగడ్డు పరిస్థితులకు సామాన్యుల కూలి వేతనం రోజుకు వెయ్యి రూపాయలైనా సరిపోదు!

మరో చిత్రమైన చిత్రమేమిటంటే కరోనాతో దేశం చిన్నాభిన్నమై ఆర్ధికంగా కుదేలై దిగజారిపోతే మన అంబాని అన్న మాత్రం ధనవంతుల జాబితాలలో మరో మెట్టు పైకెక్కి ప్రపంచ ధనవంతులలో నాల్గవ స్థానంలోకి ఎగబాకాడు!

ఇకపోతే చదువులకు చద్దన్నం కూడా లేదు, పిల్లలకు పరమాన్నంలా పరమానందం లభించింది!

కాకపోతే వారి భవిష్యత్ ఏమిటోనని తల్లిదండ్రులే కంగారు పడేది.

విరివిగా వివాహాలు సైతం విచ్చల విడిగా జరిగిపోతున్నాయి ఏమిటీ కరోనానా ఏదీ మేమూ చూస్తాం ఆచిత్రవిచిత్ర మహా భయంకర మహమ్మారినంటూ మన బుడతడలూ భూమ్మీద అత్యధికంగా నూతనంగా పురుడు పోసుకుంటూనే వున్నారు!

జీవితం బహు చిత్రమైనది ఈ ఒక్క సంవత్సరమే మనిషికి ఒక కమర్షియల్ సినిమా చూపించేసింది.

నాస్థికులకు దేవుడు లేడు అని మరింత గట్టిగా వాదించడానికి ఊతమిచ్చినట్లైనది అలాగే దేవుడు అంతానికి ఇదిగో ఆరంభమంటూ మనకు సూచన ఇచ్చినట్లుగానూ ఉంది.

ఇక మనం ఎప్పటికైనా మరణించే వారిమే కనుక ఇప్పటికైనా మారి మనిషి మనిషినిని ప్రేమించ గలిగి మానవత్వంతో మెలగగలగాలి లేదంటే ఆరంభం ఎలాగో చూసాం ఇక అంతాన్ని కూడా చూస్తాం!


------------------------------------------------------ మీ శీలం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

ఆకాశం నీ హద్దురా...!